అసెంబ్లీ అనేది 5 సంవత్సరాల తర్వాత దానంతటా అదే రద్దు అవ్వొచ్చు లేదా ముందుగా రద్దు కావచ్చు. అప్పుడు ECI ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తుంది. ఎన్నికల అనంతరం ప్రభుత్వం 2 రకాలుగా ఏర్పడుతుంది.
1) ఏదైనా ఒక పార్టీకి 50% కన్నా ఎక్కువ సీట్లు రావడం.
2) హంగ్ ప్రభుత్వం
1) ఏదైనా ఒక పార్టీకి 50% కన్నా ఎక్కువ సీట్లు రావడం:
ఏదైనా ఒక పార్టీకి 50% కన్నా ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు ఆ పార్టీ లెజిస్లేచర్ లీడర్ ని ఎన్నుకుంటుంది. ఇలా ఎన్నుకోబడిన వ్యక్తి పార్లమెంట్ లెవెల్ లో MP కావచ్చు లేదా కాకపోవచ్చు రాష్ట్ర స్థాయిలో అయితే MLA/MLC కావచ్చు లేదా కాకపోవచ్చు.
రాష్ట్ర రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో కూడా కొందరు ప్రముఖ నాయకులు ఎమ్మెల్యే (MLA) లేదా ఎమ్మెల్సీ (MLC) కాకుండానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఆ తర్వాత రాజ్యాంగ నిబంధనల ప్రకారం 6 నెలల లోపు ఎన్నికల్లో గెలిచి తమ పదవులను నిలబెట్టుకున్నారు.
అలాంటి కొన్ని ప్రధాన సంఘటనలు .....
1. మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్)పరిస్థితి:
2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పార్టీ (TMC) ఘనవిజయం సాధించారు కానీ, మమతా బెనర్జీ స్వయంగా నందిగ్రామ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.
కానీ ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ఆ తర్వాత 6 నెలల ముగిసేలోపు అనగా 2021లో జరిగిన భవానీపూర్ ఉప ఎన్నికలో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు.
2. పుష్కర్ సింగ్ ధామి:
ఇతని పరిస్థితి కూడా ఇంతే, 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది, కానీ తను మాత్రం ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై నమ్మకంతో మార్చి 2022లో మళ్లీ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత జూన్ 2022లో జరిగిన చంపావత్ ఉప ఎన్నికలో రికార్డు మెజారిటీతో గెలిచి శాసనసభలో సభ్యుడయ్యారు.
3. ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర)పరిస్థితి:
2019 మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తర్వాత మహా వికాస్ అఘాడీ కూటమి తరపున ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఎన్నికయ్యారు. అప్పటివరకు ఆయన ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు.
నవంబర్ 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 6 నెలల గడువు ముగియడానికి కొద్దిరోజుల ముందు (మే 2020లో) గవర్నర్ కోట/ఎమ్మెల్సీ (MLC) గా ఏకగ్రీవంగా ఎన్నికై పదవిని కాపాడుకున్నారు.
గతంలో యోగి ఆదిత్యనాథ్ (2017లో ఉత్తరప్రదేశ్ సీఎం అయినప్పుడు అతను MLA /ఎమ్మెల్సీ కాదు), మరియు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు, ఆ తర్వాత 6 నెలల లోపు శాసనమండలి (MLC) సభ్యులుగా ఎన్నికైన సందర్భాలు ఉన్నాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) కల్పించిన ఈ వెసులుబాటు వల్లే రాజకీయ పార్టీలు తమ కీలక నాయకులు ఎన్నికల్లో ఓడిపోయినా లేదా పోటీ చేయకపోయినా వారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టగలుగుతున్నాయి.
రాష్ట్రంలో ఎన్నికల ద్వారా మెజారిటీ సాధించిన పార్టీ తరుపున ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన లీడర్ ఆ రాష్ట్ర గవర్నర్ ను కలసి మాకు 50% కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మమ్మల్ని ఆహ్వానించండి అని అడుగుతారు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ వారిని ఆహ్వానిస్తారు. గవర్నర్ సీఎం ని, మంత్రులని పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇలా ప్రభుత్వం ఏర్పడుతుంది.
ఆర్టికల్ 164(3) అనేది ప్రమాణ స్వీకారం (కార్యాలయం మరియు గోప్యత ప్రమాణం) గురించి వివరిస్తుంది. ఏ మంత్రి అయినా తన పదవిని చేపట్టే ముందు, భారత రాజ్యాంగం పట్ల విధేయుడిగా ఉంటానని గవర్నర్ సమక్షంలో పదవీ ప్రమాణం, మరియు గోప్యతా ప్రమాణం చేయాలి. కొత్తగా ఎన్నికైన మంత్రి ప్రమాణ స్వీకారానికి గవర్నర్ సమక్షంలో, "భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వసనీయతను, విధేయతను చూపుతానని..." అని దైవసాక్షిగా లేదా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తారు.
భారతదేశంలో సాధారణంగా CM ని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోరు. ఎమ్మెల్యేగా లేకపోతే ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు .
ఇలా అయినా సీఎం మరియు మంత్రులు గవర్నర్ ని కల్సి ఆర్టికల్ 163(1) ప్రకారం అసెంబ్లీ ని సమావేశపరచమని సలహా ఇస్తారు. దీనికి అధ్యక్షత వహించడానికి గవర్నర్ తాత్కాలిక స్పీకర్ ను నియమిస్తారు. ఇతన్ని ప్రొటెం స్పీకర్ అంటారు.
రాష్ట్ర శాసనసభకు (అసెంబ్లీ) సంబంధించిన ఆర్టికల్ 180(1) ప్రకారం స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవులు ఖాళీగా ఉన్నప్పుడు, ఒక సభ్యుడిని తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న గవర్నర్ ఒక వ్యక్తిని నియమిస్తారు. ఇతనినే మనం "ప్రొటెమ్ స్పీకర్" అని పిలుస్తాము.
కేంద్ర పార్లమెంటుకు (లోక్ సభ) సంబంధించిన ఆర్టికల్ 95(1) ప్రకారం లోక్‌సభ స్పీకర్ స్థానం ఖాళీగా ఉన్నప్పుడు రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు.
ఈ ప్రొటెం స్పీకర్ ఆర్టికల్ 188 ప్రకారం కొత్తగా ఎన్నికైన MLA ల చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంకా కొత్త స్పీకర్ ను ఎన్నుకుంటారు. సాధారణంగా సభలో అత్యంత సీనియారిటీ (ఎక్కువ సార్లు గెలిచిన) ఉన్న సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడం సాంప్రదాయకంగా వస్తోంది. కొత్త స్పీకర్ ఎన్నిక పూర్తి కాగానే ఈ తాత్కాలిక ప్రొటెం స్పీకర్ పదవి ఆటోమేటిక్‌గా ముగుస్తుంది.
అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వీటికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఎప్పుడైతే మొదటి అసెంబ్లీ సమావేశం మొదలవుతుందో ఆ రోజు నుండి 5 సం॥ల వరకు ఈ ప్రభుత్వం నడుస్తుంది.
2) హంగ్ ప్రభుత్వం:
ఏ పార్టీకి కూడా 50% కన్నా ఎక్కువ సీట్లు రాకపోతే దానిని హంగ్ అసెంబ్లీ అంటారు. ఇవి 3 రకాలు.
ఎ) ప్రీ పోల్ అలయన్స్:
ప్రీ పోల్ అలయన్స్ అనగా ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పాల్గొనడం. ఉదాహరణకు గత సార్వత్రిక ఎన్నికల్లో APలో TDP, BJP & జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో జరిగింది.
ముందుగా గవర్నర్ ఈ కూటమికే మొదటి ప్రాధాన్యతను ఇస్తారు.
బి) సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ:
ఇందులో 50% కన్నా ఎక్కువ సీట్లు రాకున్నా ఉన్న పార్టీలలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయో ఆ పార్టీని పిలుస్తారు.
సి) పోస్ట్-పోల్ అలయన్స్:
ఉదాహరణకు ఒక రాష్ట్రంలో 119 సీట్లలో ఏ పార్టీకి 50% కన్నా ఎక్కువ సీట్లు రాలేదు కానీ A అనేపార్టీకి 50 సీట్లు, B పార్టీకి 54 సీట్లు వచ్చాయి కానీ A యొక్క మిత్రపక్ష పార్టీ అయిన C కి 15 సీట్లు వస్తే A & C కలిపి 65 సీట్ల మెజారిటీ వస్తుంది. అప్పుడు ఆ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానిస్తాడు.
రాష్ట్రాల గవర్నర్ CM ని & మంత్రులను నియమించిన తర్వాత ఆ ప్రభుత్వం యొక్క మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ [విశ్వాస తీర్మానం] ను నిరూపించాల్సి ఉంటుంది.
ఒక వేళ ఈ విశ్వాస తీర్మానం నెగ్గితే అప్పుడు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది లేకపోతే మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో విజయ్ యొక్క టీవీకే (TVK) పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది, కానీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాల కంటే తక్కువ స్థానాలు ఉన్నాయి, గవర్నర్‌కు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం (ట్రస్ట్ ఓటు/ఫ్లోర్ టెస్ట్) పై ఓటింగ్ నిర్వహించగా, 144 ఓట్లతో ప్రభుత్వం ఘన విజయం సాధించింది.
ఇంతకుముందు 2024లో జార్ఖండ్ మరియు బీహార్‌లలో కూడా కూటముల మార్పుల వల్ల విశ్వాస తీర్మానాల ద్వారా కొత్త ప్రభుత్వాలు బలాన్ని నిరూపించుకున్నాయి.
గమనిక! ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చనిపోతే లేదా రాజీనామా చేస్తే సీఎంతో పాటుగా మంత్రి మండలి రద్దయిపోయి మళ్లీ కొత్త మంత్రి మండలి ఏర్పడుతుంది.
అదనపు సమాచారం:
ఆర్టికల్ 75 (1A): పార్లమెంటులో మొత్తం MPల సంఖ్యలో 15% ని మించి మంత్రులు ఉండరాదు.
ఆర్టికల్ 164 (1A): అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో 15% ని మించి మంత్రులు ఉండరాదు. (కనీసం 12 మంది ఉండాలి) ఢిల్లీలో అయితే 10% కన్నా ఎక్కువగా ఉండకూడదు.
రాష్ట్ర మంత్రి మండలిలో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం మంత్రుల సంఖ్య.. ఆ రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ) మొత్తం సభ్యుల సంఖ్య 15% మించకూడదు. అయితే, చిన్న రాష్ట్రాల్లో పరిపాలన సౌలభ్యం కోసం మంత్రుల సంఖ్య కనీసం 12 ఉండాలి.
ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పాత ప్రభుత్వాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు. వీరు కాబినెట్ మీటింగ్ ను నిర్వహించవచ్చు, ఏమైనా అత్యవసర నిర్ణయాలు ఉంటే తీసుకోవచ్చు కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదు.
CM & మంత్రుల పదవీ కాలం అనేది గవర్నర్ సంతృప్తి మేరకు ఉంటుంది. షెడ్యూల్ 10 ప్రకారం పార్టీ ఫిరాయింపుల ప్రకారం ఎవరైనా క్వాలిఫై కాకపోతే గవర్నర్ అతను/ఆమె మంత్రి పదవిని రద్దు చేస్తారు.
ఆర్టికల్ 167: CM విధుల గురించి & ఆర్టికల్ 78: ప్రధాన మంత్రి విధుల గురించి తెలియచేస్తుంది.
ఆర్టికల్ 88 & 177: మంత్రులు రెండు సభల్లో ఏ సభలోనైనా పాల్గొనవచ్చు.
అటార్నీ జనరల్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనవచ్చు.
ముఖ్యమంత్రి కి నిజమైన అధికారాలు ఉంటే గవర్నర్ కు మాత్రం నామమాత్రపు అధికారాలు ఉంటాయి.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాతీర్పు ఆధారంగా ప్రభుత్వాల ఏర్పాటు అనేది అత్యంత కీలకమైన ప్రక్రియ. ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా 'హంగ్' నిబంధనలు మరియు గవర్నర్/రాష్ట్రపతి విచక్షణలు ఎంతగానో దోహదపడతాయి. ఎన్నికల ముందరి కూటములు (ప్రీ-పోల్), ఎన్నికల తర్వాత కూటములు (పోల్-పోల్) లేదా అతిపెద్ద పార్టీని ఆహ్వానించడం ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వివిధ మార్గాలను సుగమం చేస్తుంది.
కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, ఆర్టికల్ 75(1A), 164(1A) వంటి నిబంధనల ద్వారా మంత్రిమండలి పరిమితిని నిర్దేశించడం అధికార వికేంద్రీకరణ దుర్వినియోగం కాకుండా రాజ్యాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. చివరిగా, కేంద్ర-రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడంలో సీఎంలు, జోన్ కౌన్సిల్ మరియు నీతి ఆయోగ్ వంటి సంస్థల పాత్ర దేశ సమగ్రతకు మరియు సహకార సమాఖ్య స్ఫూర్తికి (కోఆపరేటివ్ ఫెడరలిజం) నిదర్శనంగా నిలుస్తుంది.
మీ అమూల్యమైన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు. ధన్యవాదాలు 🌹🌹

0 Comments