భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌కు అధికారికంగా 'పాకెట్ వీటో' అనే ప్రత్యేక హక్కు లేదు.
అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి నిర్దిష్ట కాలపరిమితి (సమయ పరిమితి) లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, పలు రాష్ట్రాల గవర్నర్ల బిల్లులను నిరవధికంగా పెండింగ్‌లో పెట్టారు. దీనినే అనధికారికంగా 'పాకెట్ వీటో'గా పరిగణిస్తారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 (రాష్ట్ర బిల్లులకు గవర్నర్ ఆమోదం) పరిధిపై సుప్రీంకోర్టు ఇటీవలి కాలంలో చరిత్ర మరియు మైలురాయి లాంటి తీర్పులను ఇచ్చింది.
ఆర్టికల్ 200 పై సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రధాన తీర్పులు మరియు వాటి ముఖ్యాంశాల పరిశీలన చేద్దాం.
1. ఆర్.ఎన్. రవి (తమిళనాడు గవర్నర్) వివాదం:
గతంలో తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన NEET మినహాయింపు బిల్లు మరియు ఆన్‌లైన్ జూదం బిల్లులతో సహా దాదాపు 10 బిల్లులను ఆయన సుదీర్ఘకాలం పాటు పెండింగ్‌లో పెట్టారు.
ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరగా, గవర్నర్లు బిల్లు నిరవధికంగా పెండింగ్‌లో ఉంచడం "రాజ్యాంగ విరుద్ధం" అని సుప్రీం స్పష్టం చేసింది.
ఈ కేసులో భాగంగా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపిన 10 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది:
రాష్ట్రపతికి పంపడం చెల్లదు: గవర్నర్ ఒకసారి బిల్లును నిలిపివేసి, శాసనసభను మళ్లీ ఆమోదించిన తర్వాత, దానిని రాష్ట్రపతికి పంపే హక్కు గవర్నర్‌కు లేదు.
ఆర్టికల్ 142 ద్వారా సుప్రీం జోక్యం: ఈ కేసులో సుప్రీంకోర్టు తనకున్న అసాధారణ అధికారమైన ఆర్టికల్ 142ను, పెండింగ్‌లో ఉన్న 10 బిల్లులకు "ఆమోదం లభించినట్లుగా" (డీమ్డ్ అస్సెంట్) చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది.
మంత్రిమండలి సలహాకే ప్రాధాన్యత: ఆర్టికల్ 200 ప్రకారం బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు గవర్నర్‌లు సాధారణంగా రాష్ట్ర మంత్రిమండలి సలహాలు, సూచనల (సహాయం మరియు సలహా) ప్రకారమే నడుచుకోవాలని గుర్తుచేసుకుంది.
2. తమిళిసై సౌందరరాజన్ (తెలంగాణ మాజీ గవర్నర్) వివాదం:
గతంలో తెలంగాణ ప్రభుత్వం పంపిన విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు (కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లు) తో పాటు దాదాపు 10 కీలక బిల్లులను ఆమోదించకుండా చాలా కాలం పాటు తన వద్దే ఉంచుకున్నారు.
అప్పటి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది, ఆర్టికల్ 200లో 'వీలైనంత త్వరగా' అనే నిబంధనను గవర్నర్‌లు గౌరవించాలని కోర్టు వ్యాఖ్యానించింది.
3. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ (కేరళ గవర్నర్) వివాదం:
గతంలో కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన పలు విశ్వవిద్యాలయ సవరణ బిల్లులను, లోకాయుక్త సవరణ బిల్లులను ఈయన దాదాపు 2 సంవత్సరాలకు పైగా ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంది.
కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత ఆయన కొన్ని బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారు.
4. జగదీప్ ధన్‌ఖర్ (పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్) వివాదం:
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న సమయంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి, ఈయనకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులతో పాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లులను ఆయన చాలా కాలం ఆమోదించకుండా నిలిపివేశారు.
5.పంజాబ్ ప్రభుత్వం వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నర్ (2023):
ఈ కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 200 యొక్క మొదటి నిబంధనను క్షుణ్ణంగా విశ్లేషిస్తూ చరిత్రాత్మక తీర్పునిచ్చింది:
బిల్లును తొక్కిపెడితే వెనక్కి పంపాల్సిందే: గవర్నర్ ఒక బిల్లుకు ఆమోదాన్ని నిలిపివేస్తే (విత్ హోల్డ్ అస్సెంట్), ఆయన కేవలం నిశ్శబ్దంగా కూర్చోవడానికి వీల్లేదు. ఆ బిల్లును "వీలైనంత త్వరగా" తిరిగి పునఃసమీక్ష కోసం అసెంబ్లీకే పంపాలి.
రెండోసారి ఖచ్చితంగా ఆమోదించాలి: గవర్నర్ వెనక్కి పంపిన బిల్లును అసెంబ్లీ ఎలాంటి మార్పులు చేయకుండా లేదా మార్పులు చేసి మళ్లీ ఆమోదం కోసం గవర్నర్‌కు పంపితే, అప్పుడు గవర్నర్‌కు ఆ బిల్లును నిలిపివేసే హక్కు లేదు, ఆయన ఖచ్చితంగా ఆమోదం తెలిపి తీరాలి.
ప్రజాస్వామ్య సూత్రం: ప్రజల చేత ఎన్నికకాని గవర్నర్, ప్రజలచే ఎన్నికైన శాసనసభ (అసెంబ్లీ) యొక్క చట్టసభల అధికారాలను నిరవధికంగా నిలిపివేయాలని కోర్టు స్పష్టం చేసింది.
నభమ్ రేబియా కేసు (2016):
పూర్వపు కేసు అయినప్పటికీ, ఆర్టికల్ 200 వివాదాల్లో దీనిని ప్రామాణికంగా తీసుకుంటారు:
రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌కు నిర్దేశించిన విచక్షణాధికారాలు పరిమితమైనవని కోర్టు స్పష్టం చేసింది.
బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్ సొంత నిర్ణయాలు తీసుకోలేరు..... మంత్రిమండలి నిర్ణయాలకే కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ తీర్పునిచ్చింది.
అలానే శంషేర్ సింగ్ జడ్జిమెంట్ (1974) కేసులో గవర్నర్ రాష్ట్ర మంత్రి మండలి ఇచ్చినటువంటి నిర్ణయాలను ఖచ్చితంగా అనుసరించాల్సిందే అని SC.
సుప్రీంకోర్టు నిర్దేశించిన కాలపరిమితులు (టైమ్ లైన్స్):
గవర్నర్ల బిల్లులను నిరవధికంగా పెండింగ్‌లో ఉంచడానికి లొసుగులను అరికట్టడానికి సుప్రీంకోర్టు ఈ క్రింది స్పష్టమైన కాలపరిమితులను ప్రతిపాదించింది:
ఆమోదం నిలిపివేతకు: ఒక బిల్లును నిలిపివేయాలనుకుంటే అసెంబ్లీ నుంచి వచ్చిన 1 నెలలోపు ఆ నిర్ణయాన్ని ప్రకటించాలి.
క్యాబినెట్ సలహాకు వ్యతిరేకంగా: రాష్ట్ర క్యాబినెట్ సలహాలకు విరుద్ధంగా వ్యవహరించాల్సి వస్తే 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలి.
మళ్లీ పంపిన బిల్లులకు: అసెంబ్లీ పునఃసమీక్షించి రెండోసారి పంపిన బిల్లులపై గవర్నర్ కేవలం 1 నెల లోపే ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.
కోర్టు తీర్పుల సారాంశం (Key Takeaways):
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భారతదేశంలో గవర్నర్‌కు బిల్లులపై "అబ్సల్యూట్ వీటో" లేదా "పాకెట్ వీటో" ఉపయోగించడానికి వీలు లేదు.
ఆర్టికల్ 200లోని "వీలైనంత త్వరగా" అనే పదాన్ని ఆసరాగా చేసుకొని కాలయాపన చేయకూడదని, శాసనసభ పంపిన బిల్లులపై గవర్నర్‌లు వేగంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతికి పంపవచ్చు. అంతేకాని గవర్నర్ కు రాష్ట్రపతికి ఉన్నట్టుగా పాకెట్ వీటో అధికారం ఉండదు.
గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా బిల్లును ఆమోదించడానికి టైమ్ లిమిట్ అంటూ రాజ్యాంగం లో లేదు కాబట్టి రాష్ట్రపతి ఆ బిల్లులకు ప్యాకెట్ వీటో ను ఉపయోగిస్తారు కానీ గవర్నర్ కు మాత్రం ఆ అవకాశం లేదు. కానీ ఈ లొసుగులను (లూప్‌హోల్స్) ఆధారంగా ఈ విచక్షణను గవర్నర్లు తరచుగా ఉపయోగిస్తున్నారు.
ఆర్టికల్ 154 (1) ప్రకారం రాష్ట్రంలోని కార్యనిర్వాహక విధులను గవర్నర్ పేరు మీదుగా జరుగుతాయి. అలానే ఆర్టికల్ 53 ప్రకారం కేంద్ర ప్రభుత్వం యొక్క కార్య నిర్వహక విధులన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతాయి.
గవర్నర్ గురించి చెప్పాలంటే మన రాజ్యాంగం ప్రకారం గవర్నర్ కి ఎలాంటి విధులు లేవు. అనగా తనంతట తానుగా నిర్వర్తించే విధులను రాజ్యాంగం ఇవ్వలేదు. (సర్కారియా కమీషన్ కూడ ఇదే చెప్పింది) ఆయన ఒక ఆర్నమెంట్ (అలంకార ప్రాయం) మాత్రమే.
గమనిక: రాష్ట్రానికి సంబంధించిన మనీ బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి దాన్ని రిటర్న్ చేసే అవకాశం లేదు. ఆ బిల్లును అంగీకరించాలి, లేదా రిజెక్ట్ చేయాలి, అలానే పార్లమెంట్‌లోని మనీబిల్లు, రాష్ట్రపతి వద్దకు వచ్చాక అంగీకరించాలి లేదా తిరస్కరించాలి అంతేకానీ రిటర్న్ చేసే అవకాశం లేదు.
గమనిక: కేంద్ర స్థాయిలో అధికారికంగా పాకెట్ వీటోను ఉపయోగించిన ఏకైక రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్. ఆయన 1986లో 'ఇండియన్ పోస్ట్ ఆఫీస్ (సవరణ) బిల్లు'ను ఆమోదించకుండా నిరవధికంగా పెండింగ్‌లో పెట్టారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200, 201లలోని లొసుగులను ఆసరాగా చేసుకుని గవర్నర్లు బిల్లులను నిరవధికంగా పెండింగ్‌లో పెట్టడం అనేది సమాంతర పాలన సాగించడమే అవుతుంది.
'శంషేర్ సింగ్ (1974)' కేసు నుండి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వరకు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిన నిజం ఒక్కటే భారతదేశంలో చట్టబద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తోంది. ప్రజల చేత ఎన్నికైన శాసనసభల నిర్ణయాలకు, మంత్రిమండలి సలహాలకు వ్యతిరేకంగా వ్యవహరించే విచక్షణాధికారం లేదా, పాకెట్ వీటో అధికారం గవర్నర్లకు లేదు.
రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశించినట్లుగా గవర్నర్ వ్యవస్థ అనేది కేంద్రం, రాష్ట్రాల మధ్య ఒక 'వారధి'గా ఉండాలి తప్ప, అభివృద్ధిని అడ్డుకునే 'అవరోధం' కాకూడదు. సుప్రీంకోర్టు నిర్దేశించిన కాలపరిమితులను గౌరవిస్తూ, రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి పనిచేసినప్పుడే సమాఖ్య స్ఫూర్తి (ఫెడరలిజం) బ్రతుకుతుంది. అలంకారప్రాయమైన పదవిలో ఉన్నవారు ప్రజాస్వామ్య నైతికతను కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది.

0 Comments