భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పదవి ఎంతో గౌరవప్రదమైనది మరియు రాష్ట్రానికి అత్యున్నతమైనది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక వారధిలా పనిచేస్తూ, రాజ్యాంగ బద్ధంగా పాలన సాగేలా చూడటం గవర్నర్ ముఖ్య విధి.
అయితే, ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాలలో గవర్నర్లు మరియు ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు (ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో) మధ్య విభేదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
గవర్నర్ల వ్యవస్థ - రాష్ట్ర ప్రభుత్వాల ఘర్షణ: సమాఖ్య స్ఫూర్తికి సవాల్?
భారతదేశంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు మరియు సమాఖ్య వ్యవస్థ (ఫెడరలిజం) పై ప్రస్తుతం ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాల నిర్ణయాలను, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న గవర్నర్లు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి.
తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ వంటి పలు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు ఈ వివాదానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
వివిధ రాష్ట్రాల్లో తలెత్తిన వివాద పరిస్థితులు:
రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని ప్రతిబింబించే కొన్ని ముఖ్యమైన అంశాలు:
తమిళనాడు (బిల్లుల పెండింగ్ మరియు ఎంపీల డిమాండ్):
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన దాదాపు 10 ముఖ్యమైన బిల్లులను గవర్నర్ సుదీర్ఘకాలం పాటు పెండింగ్‌లో పెట్టడం తీవ్ర దుమారం రేపింది.
దీనితో ఆగ్రహించిన అధికార DMK పార్టీ ఎంపీలు, గవర్నర్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని పార్లమెంట్‌లో గళమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలను గవర్నర్ కాలరాస్తున్నారు అని వాళ్ళు ఆరోపణలు చేశారు.
రాజస్థాన్ (అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపై పేచీ):
రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సమయంలో, తక్షణమే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన గవర్నర్‌ను ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి కోరింది.
రాజ్యాంగం ప్రకారం మంత్రిమండలి సిఫార్సును గవర్నర్ ఆమోదించాలి, కానీ నాటి గవర్నర్ ఆ నిర్ణయాన్ని తాత్సారం చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.
మహారాష్ట్ర (స్పీకర్ ఎన్నిక ఆలస్యం):
మహారాష్ట్రలో గతంలో మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, విధానసభ స్పీకర్ ఎన్నికకు గవర్నర్ సుముఖత చూపలేదు.
నిబంధనలను సాకుగా చూపిస్తూ స్పీకర్ ఎన్నికను ఏకంగా ఆలస్యం చేయడం ద్వారా ప్రభుత్వ పనితీరుకు ఆటంకం కలిగించారనే విమర్శలు వచ్చాయి.
తెలంగాణ (8 బిల్లుల నిలిపివేత):
తెలంగాణలో 2022-23 కాలంలో నాటి గవర్నర్ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడిచింది. అసెంబ్లీ పాస్ చేసిన దాదాపు 8 ముఖ్యమైన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తన వద్దే పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది.
కేరళ (మంత్రిని తొలగిస్తాననే హెచ్చరిక):
కేరళలో గవర్నర్ మరియు ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి మధ్య వివాదం మరింత ముదిరింది.
యూనివర్సిటీల వీసీల నియామకం, ఇతర బిల్లుల విషయంలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తనకు వ్యతిరేకంగా మాట్లాడితే "మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నాను" అని గవర్నర్ వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఒక మంత్రి పదవిలో కొనసాగాలా వద్దా అనేది ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందే తప్ప, గవర్నర్ వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై కాదనే రాజ్యాంగ నిబంధన ఈ వివాదంలోకి నెట్టింది.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
భారత ఆర్టికల్ 163 ప్రకారం, గవర్నర్ కొన్ని దేశంలో ప్రత్యేక మినహాయింపులు (విచక్షణ అధికారాలు) తప్ప, మిగిలిన అన్ని సమయాల్లో ముఖ్యమంత్రి & మంత్రిమండలి సలహాలు, సూచనల మేరకే పనిచేయాలి.
అలాగే ఆర్టికల్ 200 ప్రకారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించవచ్చు, లేదా పునఃపరిశీలనకు పంపవచ్చు.
కానీ, బిల్లులను కాలపరిమితి లేకుండా పెండింగ్‌లో పెట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో స్పష్టం చేసింది.
పరిష్కారం ఏమిటి?
గవర్నర్ వ్యవస్థబద్ధమైనదే అయినా, అది రాజకీయ రాజ్యాంగ ప్రయోజనాల కోసం వాడబడుతోందనే అభిప్రాయం ప్రజల్లో కలగకుండా చూడాలి
కొన్ని సంస్కరణలు అవసరం:
కాలపరిమితి విధింపు:
అసెంబ్లీ పంపే బిల్లులపై గవర్నర్ ఎంత కాలంగా నిర్ణయం తీసుకోవాలో (ఉదాహరణకు 1-2 నెలలు) స్పష్టమైన కాలపరిమితిని నిర్దేశించాలి.
సర్కారియా, పూంచీ కమీషన్ల సిఫార్సులు:
గవర్నర్ల నియామకంలో రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తుల ఎంపిక మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంప్రదింపుల ద్వారా నియామకం జరగాలని గతంలో వేసిన కమిషన్ సూచనలను ప్రభుత్వం అమలు చేయాలి.
సహకార సమాఖ్య స్ఫూర్తి:
కేంద్ర, రాష్ట్రాలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలి.
ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అత్యున్నతమైనది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాల నిర్ణయాలను గౌరవించినప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం ఉంటుంది.
రాజకీయ విశ్లేషణ:
ఈ వివాదాల వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు మరియు రాజ్యాంగపరమైన లొసుగులు ఉన్నాయి.
రాజకీయ విశ్లేషకులు ఈ సంక్షోభాన్ని ప్రధానంగా మూడు కోణాల్లో చూస్తున్నారు:
1.కేంద్ర ప్రభుత్వ 'రాజకీయ ఏజెంట్' ఆరోపణలు:
రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు గవర్నర్ల ఆఫీసులను (రాజ్ భవన్) అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపిస్తున్నాయి.
ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి, కేంద్ర అధికార పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న చోటే ఈ ఘర్షణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
2.నిధుల నిలిపివేత & పరిపాలనా స్తంభన:
బిల్లులను ఆమోదించకుండా "ప్యాకెట్ వీటో" తరహాలో కాలయాపన చేయడం వల్ల రాష్ట్రాల సంక్షేమాలు, విద్యాసంస్థల నియామకాల పథకాలు, బడ్జెట్ కేటాయింపులు నిలిచిపోతున్నాయి.
ఇది ఎన్నికైన ప్రభుత్వం ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకునేలా చేయడానికి ఒక పరిపాలనాపరమైన అడ్డంకిగా మారుతోందనేది విశ్లేషకుల అభిప్రాయం.
3.సమాఖ్య స్ఫూర్తి (ఫెడరలిజం) దెబ్బతినడం:
భారతదేశం 'రాష్ట్రాల కలయిక' (యూనియన్ ఆఫ్ స్టేట్స్). కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయడమే సమాఖ్య స్ఫూర్తి. అయితే, ప్రజల ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి కంటే కేంద్రం నియమించిన గవర్నర్ కే ఎక్కువ అధికారాలు ప్రవర్తించడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకే విఘాతం కలిగిస్తోంది.
⚖️ సుప్రీం కీలక తీర్పులు (ల్యాండ్‌మార్క్ కోర్ట్ కేసులు):
ఈ వివాదాలపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈ విషయాల్లో చరిత్రాత్మక తీర్పులను ఇచ్చింది.
1. ది స్టేట్ ఆఫ్ తమిళనాడు Vs గవర్నర్ ఆఫ్ తమిళనాడు (2025) కేసు:
తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఎంతో కీలకమైన తీర్పునిచ్చింది.
పాకెట్ వీటో చెల్లదు: రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద గవర్నర్‌లకు బిల్లులను అపరిమిత కాలం పాటు పెండింగ్‌లో ఉంచే "అపరిమిత అధికారం" (Absolute/Pocket Veto) లేదని కోర్టు స్పష్టం చేసింది.
ఆర్టికల్ 142 ప్రయోగం: గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిన 10 బిల్లులను సుప్రీంకోర్టు తన ప్రత్యేక అధికారాల (ఆర్టికల్ 142) ద్వారా "ఆమోదం పొందినట్లుగానే Deemed Assented" ద్వారా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
బిల్లులను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి గవర్నర్లకు కాలపరిమితిని కోర్టు (సాధారణ బిల్లులకు 1 నెల, పునఃపరిశీలన బిల్లులకు 1 నెల) నిర్దేశించింది.
2. పంజాబ్ ప్రభుత్వం Vs గవర్నర్ (2023) కేసు:
అసెంబ్లీ సమావేశాల ఏర్పాటు మరియు బిల్లుల నిలిపివేతపై పంజాబ్ ప్రభుత్వం కోర్టుకెక్కింది.
ప్రజాస్వామ్యంలో ఎన్నికైన చట్టసభల చట్టసవరణ ప్రక్రియను గవర్నర్లు తమ ఇష్టానుసారంగా చేయలేరని కోర్టు తేల్చిచెప్పింది.
ఆర్టికల్ 200 లోని "సాధ్యమైనంత త్వరగా" అనే పదానికి బిల్లులను అడ్డుకోవడం కాదని హెచ్చరించింది.
3. శంషేర్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ (1974) & ఎస్.ఆర్. బొమ్మ (1994) కేసులు:
ఈ పాత కేసుల తీర్పులను కూడా సుప్రీంకోర్టు ప్రస్తుత వివాదంలో ప్రస్తావిస్తోంది.
గవర్నర్ రాజ్యాంగబద్ధమైన అధిపతి మాత్రమే తప్ప, ఆయనకు సమాంతర పరిపాలనా అధికారాలు లేవు. ఆయన ఎల్లప్పుడూ మంత్రిమండలి సలహా మేరకే నడుచుకోవాలని ఈ తీర్పులు తెలుపుతున్నాయి.
4. సూర్య నారాయణ్ చౌదరి Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1981):
5. BP సింఘాల్ Vs UOI (2010):
ఈ కేసులో సుప్రీంకోర్టు గవర్నర్‌ను రాష్ట్రపతి ఏ క్షణంలోనైనా తీసివేయవచ్చు అని తీర్పునిచ్చింది.
ఈ రెండు కేసులలో కూడా గవర్నర్ పదవికి నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఏమీ లేదు అని చెప్పడం జరిగింది.
సుప్రీంకోర్టు తీర్పు ద్వారా గవర్నర్ల విచక్షణ అధికారాలకు కొన్ని హద్దులు ఏర్పడతాయి, రాజకీయంగా ఈ వివాదం పూర్తిగా సమసిపోలేదు.
భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం, పూంచీ మరియు సర్కారియా కమీషన్లను గౌరవించి, గవర్నర్ పదవికి రాజకీయ రంగు పులమకుండా చూసినప్పుడే భారత సమాఖ్య వ్యవస్థ బలోపేతం అవుతుంది.
గవర్నర్లు కేవలం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా కాకుండా, రాజ్యాంగ రక్షకులుగా వ్యవహరించినప్పుడే ఇటువంటి వివాదాలకు తెరపడుతుంది. దేశ ప్రగతికి కేంద్ర-రాష్ట్రాల మధ్య ఘర్షణ కంటే సమన్వయమే ఎంతో ముఖ్యం.
గమనిక : ఈ వివాదాలు అన్ని గతంలో జరిగినవి. మీకు వివరించడం జరిగింది.
ధన్యవాదాలు🌹.....

0 Comments