Role of Assembly Speaker: Election, Defection Controversies & Judgments / murthyadvise.blogspot.com

 

రాష్ట్ర శాసనసభ ప్రిసైడింగ్ అధికారులు: రాజ్యాంగ నైతికత – సమకాలీన సవాళ్లు – న్యాయ సమీక్ష (సమగ్ర విశ్లేషణ):

శాసనసభ స్పీకర్, స్పీకర్ పాత్ర - కేరళ శాసనసభ, శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్, శాసనసభ స్పీకర్‌పై గమనికలు, భారత శాసనసభ స్పీకర్, స్పీకర్ అధికారాలు మరియు విధులు, భారత శాసనసభ స్పీకర్ ఎవరు, రాష్ట్ర శాసనసభలో స్పీకర్ పాత్ర యూపీఎస్సీ


     భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య సౌధం సజావుగా సాగడానికి లోక్‌సభ/రాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవి అత్యంత కీలకమైనది. 

     శాసనసభకు స్పీకర్ ఎలాంటి బాధ్యతలను కలిగి ఉంటారో అలానే ద్విసభ విధానం (ద్వి-కెమెరల్) ఉన్న రాష్ట్రాల్లో శాసనమండలి చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ కూడా అదే విధమైన బాధ్యతలను కలిగి ఉంటారు. 

     అయితే, ఇటీవల కాలంలో స్పీకర్ వ్యవస్థ రాజకీయ పక్షపాతానికి, ఫిరాయింపులను ప్రోత్సహించే వేదికగా మారుతోందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. 

     2024-2026 మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలు, రాష్ట్రాలలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవస్థపై సమగ్ర విశ్లేషణ పరిశీలిద్ధం. 

1. ఎంపిక విధానం మరియు రాజకీయ సాంప్రదాయాలు (ఎన్నికల ప్రక్రియ & సమావేశాలు):

     ఆర్టికల్ 178 ప్రకారం ప్రతి రాష్ట్ర శాసనసభ తమలోని ఇద్దరు సభ్యులను స్పీకర్, డిప్యూటీగా ఎన్నుకుంటారు. అదేవిధంగా ఆర్టికల్ 182 ప్రకారం శాసనమండలి సభ్యులు తమలో ఇద్దరిని చైర్మన్, డిప్యూటీ చైర్మన్లుగా ఎన్నుకుంటారు.

ఎన్నిక ప్రక్రియ: సభలోని సాధారణ మెజారిటీ ద్వారా హాజరైన సభ్యులు వీరిని ఎన్నుకుంటారు. స్పీకర్ ఎన్నిక తేదీని గవర్నర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు.

     (UK)లో ఉన్నట్టుగా స్పీకర్ పదవి చేపట్టిన వ్యక్తి తన పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసే సాంప్రదాయం భారతదేశంలో లేదు. కానీ భారత దేశంలో సాధారణంగా అధికార పక్షానికి చెందిన వ్యక్తినే 'స్పీకర్' లేదా 'ఛైర్మన్'గా ఎన్నుకుంటారు. కొన్ని రాష్ట్రాలలో 'డిప్యూటీ స్పీకర్' పదవిని ప్రతిపక్షానికి ఇచ్చే సాంప్రదాయం ఉంది, కానీ ఇది రాజ్యాంగ నిబంధన కాదు. కేవలం సభలోని సంఖ్యాబలాన్నే ప్రాతిపదికగా తీసుకుంటారు కాబట్టి, అధికార పక్షం తలచుకుంటే రెండు పదవులనూ తమవారికే దక్కించుకోవచ్చు.

2. ప్రిసైడింగ్ అధికారుల నియామకం వల్ల కలిగే లాభాలు (ప్రయోజనాలు) మరియు సభ నిర్వహణ: 

     సభలో క్రమశిక్షణ, నిబంధనలు అమలు, మరియు చర్చలు సజావుగా సాగడానికి వీరు అత్యున్నత అథారిటీగా కొనసాగుతారు.

శాసన అధికారాల రక్షణ: 

     సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్ ఉల్లంఘన) జరగకుండా సభ్యుల హక్కులను కాపాడతారు.

మనీ బిల్లు ధృవీకరణ: 

     ఒక బిల్లు ద్రవ్య బిల్లు (మనీ బిల్లు) అవునా, కాదా అని నిర్ణయించే అంతిమ అధికారం కేవలం స్పీకర్‌కే ఉంటుంది.

కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణ: 

     ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేందుకు విపక్షాలకు అవకాశం కల్పిస్తూ, కార్యనిర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్) శాసనసభకు జవాబుదారీగా ఉండేలా చూడటంలో స్పీకర్ పాత్ర చాలా అమూల్యమైనది.

3. వ్యవస్థలో ఉత్పన్నమవుతున్న సమస్యలు & ప్రతిపక్షానికి జరిగే నష్టం:

     ప్రస్తుతం స్పీకర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్న అతిపెద్ద వివాదం "రాజకీయ పక్షపాత వైఖరి" (పార్టీసన్ రోల్). ఉదాహరణకు….. 

10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) దుర్వినియోగం: 

     1985 (52వ సవరణ) ద్వారా తెచ్చిన 10వ షెడ్యూల్ ప్రకారం శాసనసభ్యుల అనర్హత వేటు పై నిర్ణయం తీసుకునే స్వేచ్చా స్పీకర్‌కు ఉంది. అయితే, విపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి మారినప్పుడు, వారిపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం స్పీకర్‌కు అలవాటుగా మారింది.

ప్రతిపక్షానికి జరిగే నష్టం: 

     ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతిపక్ష పార్టీల ఉనికిని మరియు సంఖ్యాబలాన్ని దెబ్బతీస్తున్నారు.

     ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ప్రజా సమస్యలపై చర్చకు తగినంత సమయం కేటాయించకపోవడం జరుగుతుంది.

సుదీర్ఘ సస్పెన్షన్లు: 

     అధికార పక్షాన్ని ప్రశ్నించే విపక్ష సభ్యులను సభ నుండి సుదీర్ఘకాలం సస్పెండ్ చేయడం చాలా అసెంబ్లీ లలో జరుగుతుంది.

గడువు లేకపోవడం: 

     స్పీకర్ ఎంత కాలంగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలో స్పష్టమైన గడువు (సమయ పరిమితి) లేకపోవడం అనేది ఒక ప్రధాన లోపంగా మారింది. దానితో అధికార పక్షానికి ఇదొక వరంగా మారింది. 

4. సమకాలీన వివాదాలు – తాజా కరెంట్ అఫైర్స్ (2024 - 2026 పరిణామాలు):

     ఇటీవలి కాలంలో తరచుగా స్పీకర్ల పక్షపాత వైఖరి వాటిపై న్యాయస్థానాల జోక్యం ఎక్కువగా వినిపిస్తుంది అందులో కొన్ని తాజా అంశాలు కింద చర్చిస్తున్నాను.

తెలంగాణ అసెంబ్లీ వివాదం (2024-2026): 

     2024లో భారత్ రాష్ట్ర సమితి (BRS) కి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి మారారు. విచారణ అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ తీవ్ర కాలయాపన చేయడంతో విపక్షాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం (2025-2026): 

     జులై 2025లో సుప్రీంకోర్టు స్పీకర్‌కు 3 నెలల గడువు ఇచ్చింది. గడువు పొడిగిస్తూనే, ఫిబ్రవరి 2026లో సుప్రీంకోర్టు బెంచ్, స్పీకర్‌కు "కోర్టు అవమాన చర్యగా (కోర్టు యొక్క కాన్టెంప్ట్)" తుది హెచ్చరిక జారీ చేసింది.

స్పీకర్ ముగింపు నిర్ణయం (మార్చి 2026): 

     కోర్టు గడువు ముగిసేలోగా, మార్చి 2026లో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లకు " తగిన ఆధారాలు లేవు " అని కొట్టివేశారు. సాంకేతికంగా వారు ఇంకా BRS లోనే ఉన్నారని తీర్పు ఇచ్చారు, ఇది తీవ్ర రాజకీయ, న్యాయ చర్చకు దారితీసింది.

మహారాష్ట్ర స్పీకర్ తీర్పు (జనవరి 2024): 

     శివసేన పార్టీ చీలిక - వివాదంలో సుప్రీంకోర్టు విధించిన డెడ్‌లైన్ ప్రకారం అప్పటి స్పీకర్ రాహుల్ నార్వేకర్ 10 జనవరి 2024న తీర్పునిస్తూ, ఏకనాథ్ షిండే వర్గమే "నిజమైన శివసేన" అని ప్రకటించి, ఇరువర్గాల ఎమ్మెల్యేలపై అనర్హత వేటును తిరస్కరించారు. దీంతో ఉద్ధవ్ థాకరే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

గోవా అసెంబ్లీ వివాదం: 

     గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనమైన కేసులో కూడా స్పీకర్ నిర్ణయాలు మరియు న్యాయస్థానాల సమర్థనలు ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను బహిర్గతం చేశాయి.

5. ల్యాండ్‌మార్క్ కోర్టు తీర్పులు (న్యాయపరమైన ప్రకటనలు):

కిహోటో హొల్లోహన్ వర్సెస్ జాచిల్హు (1992): 10వ షెడ్యూల్ కింద స్పీకర్ తీసుకునే నిర్ణయం "న్యాయ సమీక్ష" కు లోబడి ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. స్పీకర్ ఇక్కడ ఒక క్వాసి-జుడీషియల్ ట్రిబ్యునల్‌గా ప్రవర్తించాలని చెప్పింది. 

కేషమ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ స్పీకర్ (2020): 

     ఫిరాయింపుల పిటిషన్లపై నిషేధం 3 నెలల కాలంలోనే పూర్తిచేయాలని సుప్రీం ఆదేశించింది.

పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ (2025-2026): 

     ఈ స్పీకర్ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తున్నప్పుడు ఆర్టికల్ 212 కింద ఉండే రాజ్యాంగపరమైన మినహాయింపులు (ఇమ్యునిటీ) వర్తించవని, ఉన్నత న్యాయస్థానం యొక్క ప్రకటనను అమలు చేయకపోతే, అవమాన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

6. లోక్‌సభ స్పీకర్‌కు మరియు అసెంబ్లీ స్పీకర్‌కు మధ్య తేడాలు:

     లోక్‌సభ స్పీకర్ ఆర్టికల్ 93 ప్రకారం, అసెంబ్లీ స్పీకర్ ఆర్టికల్ 178 కింద ఎన్నికవుతారు.

   పార్లమెంట్ ఉమ్మడి సమావేశానికి (జాయింట్ సిట్టింగ్ - 108 ఆర్టికల్ ప్రకారం) స్పీకర్ అధ్యక్షత వహించడం జరుగుతుంది, కానీ రాష్ట్రాలలో ఉమ్మడి సమావేశాల నిబంధన లేదు. కాబట్టి ఈ అధికారం ఉండదు.

7. నివారణ మార్గాలు & సంస్కరణలు (వే ఫార్వర్డ్):

     "ఆపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్" అన్నట్లుగా ఎమ్మెల్యేలు తమ ఐదేళ్ల పదవీకాలాన్ని ముగించేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండే పద్ధతి మారాలి. 

సూచించబడిన సంస్కరణలు:

స్వతంత్ర ట్రిబ్యునల్ ఏర్పాటు: 

     దినేష్ గోస్వామి కమిటీ మరియు NCRWC సూచనల ప్రకారం, అనర్హత వేటు వేసే అర్హత స్పీకర్ నుండి తొలగించి, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమక్షంలో ఒక స్వతంత్ర న్యాయ ట్రిబ్యునల్ కు గాని ఎన్నికల సంఘానికి గాని బదిలీ చేయాలి.

బ్రిటన్ మోడల్ అనుసరించడం: 

     "ఒకసారి స్పీకర్, ఎల్లప్పుడూ స్పీకర్" అనే సూత్రాన్ని అలవర్చుకోవాలి. స్పీకర్‌గా ఎన్నికైన వెంటనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి.

చట్టబద్ధమైన చట్ట సవరణ (2025-2026 ప్రైవేట్ బిల్లుల ప్రతిపాదనలు): 

     ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రకారం, ఒక సభ్యుడు పార్టీ మారిన స్వయంచాలకంగా (ఆటోమెటిక్ గా) సభ్యత్వం పొందిన రద్దయ్యేలా, స్పీకర్ ప్రమేయం లేకుండా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది.

     ప్రిసైడింగ్ అధికార వ్యవస్థ అనేది ప్రజాస్వామ్య సౌధానికి ఒక రక్షణ కవచం లాంటిది. స్పీకర్ కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా కాకుండా, సభ మొత్తానికి, రాజ్యాంగ నైతికతకు (Constitutional Morality) ప్రతీకగా నిలవాలి. 

     2026 నాటి తెలంగాణ స్పీకర్ తీర్పులు లేదా మహారాష్ట్ర పరిణామాలు గమనిస్తే, చట్టంలోని లొసుగులను వాడుకుని కాలయాపన చేయడం వలన ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. 

     న్యాయస్థానాలు ప్రతిసారీ జోక్యం చేసుకుని హెచ్చరించే పరిస్థితి రాకుండా ఉండాలంటే, స్పీకర్ స్థానంలో కూర్చునే వ్యక్తులు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, నిష్పాక్షికంగా వ్యవహరించినప్పుడే భారతీయ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలు నిలబడతాయి.

     లోక్ సభ స్పీకర్ ఎన్నిక విధానం, సమస్యలు, కోర్ట్ తీర్పుల గురించి ఈ లింక్ ను క్లిక్ చేయండి

     మీ అమూల్యమైన సలహాలు ఇవ్వగలరని మనవి 🙏. ధన్యవాదాలు 🌹🌹

Post a Comment

0 Comments