⇒ ప్రధాన ప్రతిపక్ష హోదా, నాయకత్వం & కీలక పాత్ర
UK (బ్రిటన్) లోని ప్రధాన ప్రతిపక్ష లీడర్ ని "లీడర్ ఆఫ్ ది అపోజిషన్" (ప్రతిపక్ష నాయకుడు) లేదా "అఫీషియల్ అపోజిషన్ లీడర్" అని సంబోధిస్తారు. మరి ఇండియాలో అయితే ఈ పదవికి రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధత ఉంది కానీ UK లో లేదు.
గడచిన 10 సం||ల తర్వాత ఈ 18వ లోక్‌సభకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారు, అలానే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే కొనసాగుతున్నారు.
భారత పార్లమెంటు (లోక్‌సభ) లో మొట్టమొదటి అధికార ప్రతిపక్ష నాయకుడిగా డా. రామ్ సుభగ్ సింగ్ 1969లో గుర్తింపు పొందారు. కాంగ్రెస్ లో చీలిక వచ్చిన పిమ్మట, ఆయన కాంగ్రెస్ (ఓ) పార్టీ నుండి ఈ పదవిని చేపట్టారు. 1977లో "ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం" (పార్లమెంటు చట్టంలో ప్రతిపక్ష నాయకుల జీతాలు మరియు భత్యాలు) ఆమోదించబడే వరకు, అంతకు ముందు అధికారిక హోదా లేనప్పటికీ పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు మరియు నాయకులు ఉన్నారు. 1977లో "ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం" వచ్చిన తర్వాత ఆ హోదా పొందిన మొదటి నాయకుడిగా వై.బి.చవాన్ నిలిచారు.
ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే 1/10 వంతు సీట్లు రావాలి.
ఒక సభలో రెండు రకాల నాయకులు ఉంటారు:
1. సభానాయకుడు
2. ప్రతిపక్షనాయకుడు (LoP)
ప్రధాన మంత్రికి ఏ సభలో అయితే సభ్యత్వం ఉంటుందో ఆ సభకు అతను సభానాయకుడు అవుతాడు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అతను రాజ్యసభ సభ్యుడు కావున అతను రాజ్యసభకు ప్రధాన నాయకుడు అయ్యాడు.
ఒకవేళ ప్రధాని లోక్‌సభకు సభానాయకుడు అయితే రాజ్యసభకు అదనపు సభానాయకుడిగా ఒక మంత్రిని ప్రధాని నియమిస్తాడు.
ప్రస్తుతం మన లోకసభకు సభానాయకుడు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వ్యవహారిస్తున్నారు కావున రాజ్యసభకు సభానాయకుడు JP నడ్డా గారు బాధ్యత వహిస్తున్నారు.
ఇక ప్రతిపక్ష నాయకుడి విషయానికి వస్తే, ఈ ప్రజాస్వామ్యంలో ఒక రూలింగ్ పార్టీ సక్రమంగా పని చేయాలన్నా, జవాబుదారీ తనంతో ప్రజలకు అండగా ఉండాలన్నా, ప్రజల పార్లమెంట్‌లో సరైన రీతిలో వినిపించాలన్నా ఒక స్ట్రాంగ్/బలమైన ప్రతిపక్ష నాయకుడు చాలా అవసరం.
ఏ ప్రతిపక్ష పార్టీకి అయితే అత్యధిక స్థానాలు ఉంటాయో ఆ పార్టీని ప్రధాన ప్రతిపక్ష పార్టీ (ప్రతిపక్ష పార్టీ నాయకుడు) అంటారు. ఇందులో ఈ హోదా గల పార్టీకి 1/10 (లేదా) 10% సీట్లు రావాలన్న నియమం ఏమీ లేదు, ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే. ఒకవేళ 1/10 వంతు రాకపోయినా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వవచ్చు.
16, 17 లోక్‌సభలలో ఏ ప్రతిపక్ష పార్టీకి కూడా 1/10 (10%) లోక్‌సభ సీట్లు రాలేదు కావున ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అని కోర్టు ద్వారా ప్రశ్నించడానికి వీలు లేదు. భారత ఆర్టికల్ 122 రాజ్యాంగ పార్లమెంటులోని సార్వభౌమాధికారం మరియు న్యాయవ్యవస్థ (కోర్టులు) పరిమితులను స్పష్టం చేస్తుంది.
దీని ప్రకారం, పార్లమెంటు అంతర్గత వ్యవహారాలలో లేదా చట్టాలు చేసే ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు.
ఈ ఆర్టికల్‌లోని రెండు ముఖ్యమైన నిబంధనలు:
ఆర్టికల్ 122(1) - విధానపరమైన లోపాలపై రక్షణ:
పార్లమెంటులో ఏదైనా చట్టాన్ని ఆమోదించేటప్పుడు లేదా చర్చలు జరిగేటప్పుడు 'విధానపరమైన లోపం' (విధానం యొక్క అక్రమత) జరిగిందనే కారణంతో ఆ ప్రక్రియను ఏ కోర్టులోనూ సవాలు చేయడానికి వీల్లేదు.
ఆర్టికల్ 122(2) - అధికారుల నిర్ణయాలపై రక్షణ:
పార్లమెంటు వ్యవహారాలను, సభా నియమాలను నియంత్రించే లేదా క్రమశిక్షణను నిర్వహించే లేదా అధికార పార్లమెంటు సభ్యులు లేదా అధికారులు (ఉదాహరణకు: స్పీకర్ చైర్మన్) తీసుకునే నిర్ణయాలు మీద కోర్ట్ ప్రశ్నించలేవు.
ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? వద్దా? అని నిర్ణయించేది లోక్‌సభ స్పీకర్. ఈ స్పీకర్ పార్లమెంటరీ మంత్రి అనగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి చెప్పిన ప్రకారం అమలు చేస్తారు. అంటే పరోక్షంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అని నిర్ణయించేది ప్రభుత్వం అన్నమాట.
ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్నో అపాయింట్‌మెంట్ కమిటీల్లో ఉంటారు. ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్నిక లేని పక్షంలో ఆయా కమిటీలలో నియామకం ఉండదు.
ఉదాహరణకు లోక్‌పాల్ అపాయింట్‌మెంట్ కమిటీల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒక సభ్యుడిగా ఉంటారు. కానీ 16 & 17 లోక్‌సభలలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేరు కావున లోక్‌పాల్ సభ్యుడిని ఎన్నుకోలేదు.
కావున దీన్ని ఉద్దేశిస్తూ SC ఏమి చెప్పిందంటే ఏ అపాయింట్‌మెంట్‌లో అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఉంటుందో అదే ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేని పక్షంలో ప్రతిపక్ష పార్టీలలో ఎవరికైతే ఎక్కువ సీట్లు ఉంటాయో ఆ పార్టీ లీడర్‌నే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకొని ఈ అపాయింట్‌మెంట్ కమిటీలో వారి పాత్రను అధిరోహించి అధికారులను సెలెక్ట్ చేయొచ్చు, కోకపోతే కాబినెట్ హోదా దక్కదు అని చెప్పింది.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గురించి ఐవర్ జెన్నింగ్స్ మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఆల్టర్నెట్ PM అని వర్ణించాడు.
ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతకు చట్టబద్ధత కల్పించారు. పార్లమెంట్ చట్టంలో ప్రతిపక్ష నాయకులు - 1977 ప్రకారం ఈయన జీతాలు & భత్యాలు నెలకు 3.3 లక్షలు.
ఆ వివరాలు........
నియోజకవర్గ భత్యం: నెలకు రూ. 70,000.
కార్యాలయ ఖర్చులు (ఆఫీస్ ఖర్చు భత్యం): నెలకు రూ. 60,000.
సత్కారాల భత్యం (సంప్చురీ అలవెన్స్): నెలకు రూ. 2,000.
దినసరి భత్యం (రోజువారీ భత్యం): పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు లేదా కమిటీ మీటింగ్‌లకు హాజరైనప్పుడు రోజుకు రూ. 2,000 చొప్పున లభిస్తుంది.
జీతంతో పాటు లభించే ఇతర ముఖ్యమైన సేవలు:
క్యాబినెట్ హోదా బంగ్లా: ఢిల్లీలోని ల్యుటెన్స్ జోన్‌లో ఉచిత ప్రభుత్వ నివాసం లభిస్తుంది.
భద్రత: క్యాబినెట్ మంత్రులకు సమానంగా Z+ కేటగిరీ సెక్యూరిటీ లేదా అవసరమైన ప్రభుత్వ రక్షణ కల్పిస్తారు.
ప్రయాణ మరియు వైద్య సౌకర్యాలు: ఉచిత రైలు/విమాన ప్రయాణాలు మరియు కుటుంబ సభ్యులతో సహా జీవితాంతం ఉచిత వైద్య సౌకర్యాలు అందుతాయి.
కార్యాలయ సిబ్బంది: సొంత సెక్రటేరియట్ సిబ్బందిని (సెక్రటేరియల్ స్టాఫ్) నియమించుకునే సదుపాయం ఉంటుంది.
గమనిక: ఒక సభ్యుడికి ప్రధాన ప్రతిపక్ష నేతగా జీత భత్యాలు అందుతుంటే అతనికి MP గా జీతం రాదు. ఎందుకంటే అలా వస్తే అది Office of Profit (లాభదాయక పదవి) గా అవుతుంది.
భారత ప్రభుత్వ అధికారిక ప్రోటోకాల్ (టేబుల్ ఆఫ్ ప్రిసిడెన్స్) ప్రకారం, లోక్‌సభ మరియు రాజ్యసభల ప్రధాన ప్రతిపక్ష నాయకుల ప్రోటోకాల్ కేంద్ర క్యాబినెట్ మంత్రులతో సమానంగా ఉంటుంది.
భారతదేశ వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్ (వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్) లో వీరు 7వ ర్యాంక్ లో ఉంటారు. ఈ ఏడవ ర్యాంక్ లో ప్రతిపక్ష నాయకుడితో పాటు సమానమైన ప్రోటోకాల్ ఉంటే ఇతర ప్రముఖులు మరియు వారి వివరాలు :
కేంద్ర క్యాబినెట్ మంత్రులు (కేంద్ర క్యాబినెట్ మంత్రులు)
రాష్ట్రాల ముఖ్యమంత్రులు (వారి స్వంత రాష్ట్రాల పరిధిలో)
నీతి ఆయోగ్ వైస్ చైర్‌పర్సన్ (నీతి ఆయోగ్ వైస్-ఛైర్‌పర్సన్)
భారత మాజీ ప్రధాన మంత్రులు (మాజీ ప్రధానులు)
జాతీయ భద్రతా సలహాదారు (జాతీయ భద్రతా సలహాదారు - నాసా)
ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి (ప్రధాన మంత్రికి ప్రధాన కార్యదర్శి)
ప్రోటోకాల్ పరంగా లభించే కొన్ని ముఖ్య ప్రాధాన్యతలు:
సభా సీట్ల కేటాయింపు: పార్లమెంట్ సభలో స్పీకర్/చైర్మన్ కు ఎడమవైపు ఉండే మొదటి వరుస (ముందు వరుస) లో వీరికి సీటు కేటాయిస్తారు.
రాష్ట్ర అధికారిక కార్యక్రమాలు: గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం లేదా విదేశీ ప్రతినిధుల అధికారిక విందుల వంటి కార్యక్రమాలలో కేంద్రబినెట్ మంత్రులతో సమానమైన ఆసన వసతి, గౌరవం కల్పిస్తారు.
పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే సమయంలో కూడా ముందు వరుసలోనే కూర్చునే అర్హత ఉంటుంది.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా & విధులు:
ప్రభుత్వంపై అపోజిషన్ పార్టీగా ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీయడం.
ప్రజల సమస్యలను ప్రశ్నించడం
ఆల్టర్‌నెట్ PM గా వ్యవహరించడం
గమనిక: UK లో షాడో PM & షాడో మినిస్టర్స్ గా ప్రతిపక్ష నేతలు ఉంటారు కానీ భారతదేశంలో ఉండరు కానీ వారి విధులను డిపార్ట్మెంట్ అండ్ స్టాండింగ్ కమిటీ చూస్తుంది.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ క్రింది అపాయింట్‌మెంట్లలో కీలక పాత్ర నిర్వర్తిస్తాడు:
- CBI డైరెక్టర్ ను అపాయింట్ చేయడంలో
- CVC [చీఫ్ విజిలెన్స్ కమిషనర్] & CIC [చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్] అపాయింట్‌మెంట్ విషయంలో
- నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ ఛైర్మన్ & ఇతర సభ్యుల ఎంపిక విషయంలో
- లోక్‌పాల్ సభ్యుల అపాయింట్‌మెంట్
- ECI [ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా] ఎన్నుకోవడంలో [CEC & EC లు]
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ క్రింది కమిటీలలో సభ్యులుగా ఉంటారు.
PAC (పబ్లిక్ అకౌంట్ కమిటీ).
పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ.
ఎస్టిమేట్ కమిటీ (ఇందులో రాజ్యసభ సభ్యులు ఉండరు).
సవరల్ జైంట్ పార్లమెంటరీ కమిటీలు.
ఇలాంటి నియామక కమిటీలలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, PM, ఒక కేంద్ర మంత్రి ఉంటారు. ఇక్కడ రూలింగ్ పార్టీ వాళ్ళది పైచేయి అయినా కానీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరపున తన ధ్వని గాంభీర్యతను ప్రదర్శించగలరు.
రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలను, ప్రజల అవసరాలను పార్లమెంట్‌లో గంభీరంగా వినిపించడమే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పరమావధి. అధికార పక్షాన్ని సరైన మార్గంలో ఉంచుతూ, దేశ ప్రగతిలో భాగస్వామి అయ్యే ఒక 'నిర్మాణాత్మక ప్రతిపక్షం' భారతదేశానికి ఎంతైనా అవసరం. బలమైన నాయకత్వం, స్పష్టమైన ప్రజా దృక్పథం ఉన్న ప్రతిపక్ష నేత ప్రజాస్వామ్యానికి నిజమైన రక్షణ కవచం.”
భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కేవలం అధికార పక్షం మాత్రమే కాదు, బలమైన ప్రతిపక్షం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేవలం ప్రభుత్వ నాయకుడు మాత్రమే కాదు, ప్రజల గొంతుకగా, ప్రభుత్వ జవాబుదారీతనానికి రక్షకుడిగా ఉంటారు.
సీబీఐ (CBI), సీవీసీ (CVC), లోక్‌పాల్ వంటి అత్యున్నత స్వతంత్ర సంస్థల నియామకాలలో ప్రతిపక్ష నాయకుడికి కీలక భాగస్వామ్యం కల్పించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం పారదర్శకతను కాపాడడమే. బలమైన ప్రతిపక్షం లేని సభ ఏకపక్ష నిర్ణయాలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే 16, 17వ లోక్‌సభల అనుభవాలను తీసుకుని, సాంకేతిక కారణాల (1/10 వంతు సీట్లు) కంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికే అపాయింట్‌మెంట్ కమిటీల్లో అత్యున్నత న్యాయస్థానం ప్రాధాన్యతనిచ్చింది. ప్రతిపక్ష నాయకత్వం బాధ్యత ఉన్నప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత పటిష్టంగా నిలబడుతుంది."
ఐవర్ జెన్నింగ్స్ అన్నట్లు ప్రతిపక్ష నేత 'ప్రత్యామ్నాయ ప్రధానమంత్రి' (Alternate PM) లాంటివారే. అధికార, ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యమనే రథానికి రెండు చక్రాల లాంటివి. ఈ రెండు చక్రాలు పరస్పర గౌరవంతో, రాజ్యాంగబద్ధంగా, ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పనిచేసినప్పుడే నిజమైన ప్రజాస్వామ్య ఆశయాలు నెరవేరుతాయి.
పార్లమెంట్ సభ్యుల అనర్హతలు మరియు ద్వంద్వ సభ్యత్వ నియమాలు : విశ్లేషణ కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.
మీ అమూల్యమైన సలహాలను కామెంట్ ద్వారా తెలపండి. ధన్యవాదాలు 🌹🌹

0 Comments