భారతదేశంలో గవర్నర్ వ్యవస్థ – వివాదాలు, రాజ్యాంగ సంక్షోభాలు మరియు నివారణోపాయాలు:
భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ రాష్ట్రానికి నామమాత్రపు అధిపతి. కానీ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో గవర్నర్ కార్యాలయం క్రియాశీల రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రం నియమించిన గవర్నర్లకు మధ్య ఘర్షణ వాతావరణం.
1. చారిత్రక వివాదాలు – వాకౌట్లు, జాతీయ గీత వివాదాలు:
ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాలలో గవర్నర్లు అసెంబ్లీ సంప్రదాయాలను ఉల్లంఘించిన సంఘటనలు సంచలనం సృష్టించాయి.
అసెంబ్లీ వాకౌట్ చేసిన గవర్నర్లు:
తమిళనాడు రాష్ట్రం:
మాజీ గవర్నర్ ఆర్.ఎన్. రవి రాష్ట్ర ప్రభుత్వంతో వచ్చిన విభేదాల కారణంగా 2023, 2024, 2025 మరియు 2026లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండానే సభ నుండి వాకౌట్ చేశారు.
కేరళ రాష్ట్రం:
కేరళ గవర్నర్ అరీఫ్ మహమ్మద్ ఖాన్ 2024లో ప్రభుత్వం రూపొందించిన 61 పేజీల ప్రసంగంలో కేవలం మొదటి, చివరి పేరాగ్రాఫ్‌లను మాత్రమే చదివి, మిగిలిన వాటిని దాటవేసి నిరసన వ్యక్తం చేశారు.
జాతీయ గీతం వివాదం:
తమిళనాడులో గవర్నర్ ఆర్.ఎన్. రవి తమిళ రాష్ట్ర గీతం ('తమిళ్ తాయ్ వాల్త్తు') పాడిన వెంటనే జాతీయ గీతం ఆలపించాలని అన్నాడు . అయితే అసెంబ్లీ ముగింపులోనే జాతీయ గీతం పాడే సంప్రదాయం ఉందని స్పీకర్ సమాధానం ఇవ్వడంతో గవర్నర్ జాతీయ గీతాన్ని ఆలపించకుండానే ఆయన సభ నుండి నిష్క్రమించారు. ఇలా గవర్నర్
అధికారిక కార్యక్రమాలకు హాజరు కాలేదు.
తెలంగాణా స్టేట్:
తెలంగాణలో మాజీ గవర్నర్ తమిళ సాయి సౌందరరాజన్ మరియు నాటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య వివాదం నడిచింది. దీనివల్ల గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అలాగే ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమాలకు గవర్నర్ హాజరు కాలేదు , అలానే రాజ్ భవన్ నిర్వహించిన కార్యక్రమాలకు సీఎం మరియు ఇతర మంత్రులు హాజరుకాకుండా దూరంగా ఉన్నారు.
2. రాష్ట్ర ప్రగతికి అడ్డంకులు – దేశ సమగ్రతకు భంగం:
రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన ప్రజా ఉపయోగకరమైన బిల్లులను గవర్నర్లు కాలయాపన చేయడం లేదా పెండింగ్‌లో పెట్టడం వల్ల రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడుతుంది.
ఆర్థిక, పాలనాపరమైన నష్టం:
విద్యా సంస్కరణలు, సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం వల్ల పాలన స్థంభించిపోతుంది.
సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినడం:
కేంద్రములో ఉన్న అధికార పార్టీ, రాష్ట్రంలో ఉన్న విపక్ష ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి గవర్నర్ వ్యవస్థను "రాజకీయ ఏజెంట్"గా వాడుకుంటోందనే విమర్శలు ఉన్నాయి. ఇది దేశ అంతర్గత భద్రత, కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సామరస్యానికి (సహకార సమాఖ్య) పెద్ద గండంగా మారుతుంది.
3. ప్రభావితం అవుతున్న రాజ్యాంగ ఆర్టికల్స్:
ఈ వివాదాల వల్ల భారత రాజ్యాంగంలోని క్రింది ఆర్టికల్స్ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
రాజ్యాంగ ఆర్టికల్ దాని ప్రాముఖ్యత / వివాదం:
163:
గవర్నర్ ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి సలహా, సహకారంతో పనిచేయాలి. స్వయం నిర్ణయాధికారం (విచక్షణ అధికారాలు) పరిమితం.
175 & 176:
అసెంబ్లీ ఉమ్మడి సమావేశాలలో గవర్నర్ తప్పనిసరిగా సాంప్రదాయక ప్రసంగం చేయాలి. ఈ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తయారు చేస్తుంది.
200 :
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి (ఆమోదించడం, తిరస్కరించడం, లేదా రాష్ట్రపతికి పంపడం). కానీ ఇందులో బిల్లులను ఎంత కాలంలో ఆమోదించాలి?? అనే 'సమయ పరిమితి' లేకపోవడాన్ని గవర్నర్లు ఆసరాగా చేసుకుంటున్నారు.
356 :
రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన విఫలమైందని గవర్నర్ నివేదిక ఇస్తే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఈ అధికారం తరచుగా దుర్వినియోగం అవుతోంది.
4. సుప్రీంకోర్టు తీర్పులు:
ఈ వివాదంపై సుప్రీంకోర్టు పలు కీలక తీర్పులు ఇచ్చింది.
షంషేర్ సింగ్ (1974) & నబం రేబియా (2016) కేసు:
గవర్నర్ కేవలం ఒక నామమాత్రపు పాలకుడు మాత్రమేనని, మంత్రిమండలి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.
తమిళనాడు, పంజాబ్ వర్సెస్ గవర్నర్ కేసులు (2023):
ఒక బిల్లును రెండోసారి ఆమోదించినప్పుడు , గవర్నర్ దానికి ఖచ్చితంగా ఆమోదం తెలపాలని, అపౌరుషంగా తొక్కి, గవర్నర్‌కు అనుమతి లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
5. నివారణ చర్యలు (Remedial Measures):
గవర్నర్ వ్యవస్థ వివాదరహితంగా ఉండటం కోసం దేశంలో ఏర్పడిన వివిధ కమీషన్లు కొన్ని ముఖ్యమైన సిఫార్సులు చేశాయి:
సమయ పరిమితి విధించడం:
అసెంబ్లీ పంపిన బిల్లులపై గవర్నర్ 1 నుండి 3 నెలల లోపే తన నిర్ణయాన్ని ప్రకటించేలా ఆర్టికల్ 200ను సవరించాలి.
సర్కారియా కమిషన్ (1983) సిఫార్సులు:
గవర్నర్‌గా నియమితులయ్యే వ్యక్తి క్రియాశీల రాజకీయాల్లో ఉండకూడదు. రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదించిన తర్వాతే గవర్నర్‌ను నియమించాలి.
పుంఛి కమీషన్ (2007) సిఫార్సులు:
రాష్ట్ర శాసనసభ ద్వారా గవర్నర్‌ను తొలగించే (అభిశంసన) నిబంధనను రాజ్యాంగంలో చేర్చాలి. ఇక్కడ గవర్నర్లు కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే జవాబుదారీగా ఉండటం తగ్గుతుంది.
గవర్నర్ పదవి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శిగా ఉండాలే తప్ప, సమాంతర ప్రభుత్వంగా మారకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాల నిర్ణయాలకే అత్యున్నత ప్రాధాన్యత ఉండాలి. అప్పుడే దేశ ప్రగతి, సమగ్రత సురక్షితంగా ఉంటాయి.

0 Comments